Skip to main content

ఖాళీ అవుతున్న పట్టణ ప్రణాళిక


    డిప్యుటేషన్లపై బదిలీ చేసుకుంటున్న అధికారులు
    నగరపాలికలో అధికారులు, ఉద్యోగుల కొరత తీవ్రమైంది..ఉన్న ఉద్యోగులు సైతం పని భారం, ఒత్తిళ్లు భరించలేక సెలవుల్లో వెళ్తుండడంతో పని చేసే వారిపై భారం పెరిగిపోయింది. రోజురోజుకు కొత్త కొత్త ప్రణాళికలు అమలవుతుండటంతో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఆ పనులు సకాలంలో చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
    న్యూస్‌టుడే, కార్పొరేషన్‌(కరీంనగర్‌)
    కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక, రెవిన్యూ, పారిశుద్ధ్య విభాగం, పరిపాలన విభాగం కీలకమైనవి. ఆయా విభాగాల అధికారులు, ఉద్యోగులు రోజూ ప్రజలకు సంబంధించిన అనుమతులు, ఫిర్యాదులు, సమస్యలు, అభివృద్ధి పనులు వంటివి చేపడతారు.
    ఇదంతా నిత్యం జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. అందులో పని చేసే ఉద్యోగులు, అధికారుల సంఖ్య తగ్గిపోతోంది. పని చేసే ఉద్యోగుల కొరత ఏర్పడటంతో ఉన్న ఉద్యోగులకు, అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో సమస్యలు వస్తున్నాయి.
    క్షేత్రస్థాయిలో ఉద్యోగులే కీలకం
    ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక, రెవిన్యూ, పారిశుద్ధ్య విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను ఇంజినీరింగ్‌ అధికారులు చేయాల్సి ఉంటోంది. ఎన్నికల నిర్వహణ, విధులు, భవన అనుమతులు, రోడ్ల ఆక్రమణల తొలగింపు, బృహత్తర ప్రణాళిక అమలు, సుందరీకరణ పనులు వంటివి పట్టణ ప్రణాళిక అధికారులు పర్యవేక్షణ చేయాలి. ఆస్తిపన్ను మదింపు, పన్నులు వసూలు చేసుకోవడం, ఇతర రకాల సర్వేలు చేయడం వంటి పనులు రెవిన్యూ పరిశీలిస్తోంది. ప్రతిరోజు నగరాన్ని శుభ్రంగా ఉంచడం, చెత్త సేకరణ చేయడం, మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడూ పారిశుద్ధ్య విభాగం పర్యవేక్షణ చేస్తోంది.
    బల్దియాలో డిప్యుటేషన్ల బదిలీలు
    నగరపాలక కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, అధికారుల కొరత వెంటాడుతుండగా..మరోవైపు వివిధ కారణాలతో డిప్యూటేషన్లపై బదిలీలు చేసుకొని అక్కడి నుంచే బదిలీల బాట పడుతున్నారు. మరికొందరు వ్యక్తిగత సమస్యలతో దీర్ఘాకాలిక సెలవుల్లో వెళ్తున్నారు. ఫలితంగా ఉన్న ఉద్యోగులు, అధికారులపై పని భారం పెరిగినట్లేయింది. ముఖ్యంగా పట్టణ ప్రణాలిక విభాగంలో అధికారులు, ఉద్యోగులు తీరిక తీసుకోలేనంత పనులు చేయాల్సి ఉండగా..సరైనా ఉద్యోగులు, అధికారులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా మారింది.
    కళ తప్పిన పట్టణ ప్రణాళిక
    ఒకప్పుడు పట్టణ ప్రణాళిక విభాగంలో పూర్తిస్థాయిలో అధికారులు, ఉద్యోగులతో కళకళలాడింది. ప్రస్తుతం ఆ కళ పూర్తిగా తప్పింది. అయిదుగురు బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్లు ఉండాల్సి ఉండగా ముగ్గురే మిగిలారు. అందులో ఒకరు ఏడాది కిందట గజ్వేల్‌ మున్సిపాలిటీకి ఓడీ ప్రాతిపదికన వెళ్లగా, మరొకరు సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి ఓడీ ప్రాతిపదికన వచ్చి సిద్దిపేట మున్సిపాలిటీకి ఇటీవలె వెళ్లి పోయారు. ఇద్దరు సహాయ ప్రణాళిక అధికారులు(ఏసీపీ)లు పని చేయాల్సి ఉండగా ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉండగా, మరొకరు ఓడీ ప్రాతిపదికన రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం రెండు పోస్టుల్లో పని చేసే అధికారులు లేకుండా పోయారు. ఇక మిగిలింది ముగ్గురు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒక టీపీఎస్‌, ఒక డీసీపీ..వీరిపై పని భారం పెరిగింది.
    ఎన్నికల సమయంలో సిబ్బంది కొరత
    త్వరలోనే నగరపాలక సంస్థకు పాలకవర్గ ఎన్నికలు జరగనుండటంతో ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించేది పట్టణ ప్రణాళిక అధికారులు, ఉద్యోగులే. అలాంటి శాఖలో పని చేసే సిబ్బంది, ఉద్యోగుల కొరత వేధిస్తుండటంతో సమస్యలు వచ్చేలా కనిపిస్తోంది. పైగా ప్రస్తుతమున్న వారికి సుడాకు డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. మరికొందరు ఇతర మున్సిపాలిటీలకు టీపీఓలుగా తాత్కాలిక విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి సమయంలో నగరపాలక ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా చూడాల్సిన అవసరం ఉంది. 

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.