Skip to main content

వామ్మో సర్కార్ 'నౌకరి'


    - ఉద్యోగం మానేస్తున్న పంచాయతీ కార్యదర్శులు
    - పని ఒత్తిడి, తక్కువ వేతనాలే కారణమా..
    - ఆరు నెలల్లో 34 మంది రాజీనామా
    నవతెలంగాణ-కమాన్‌పూర్‌
    ఎన్నో ఆశలతో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) విధి నిర్వహణలో నెట్టుకు రాలేకపోతున్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి..కొలువు కొట్టి భరించలేని ఒత్తిడి నడుమ విధులు నిర్వహించలేక, వచ్చే వేతనం చాలక అవస్థలు పడుతున్నారు. ఆఖరుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న దయనీయ పరిస్థితి జిల్లాలో నెలకొంది.
    జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఎంతగానో ఎదురు చూసిన వీరు, ఆ పోస్టుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తమకు ఈ ఉద్యోగం సరిపడదని కొందరు, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు గుడ్‌బై చెప్పారు.
    ఇలా..ఆరునెలల కాలంలోనే 34మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను వీడారు. 2018 అక్టోబర్‌లో ప్రభుత్వ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ప్రతిభ కనబర్చిన వారికి 2019 ఏప్రిల్‌లో నియామక పత్రాలు అందించారు.
    రాజీనామా బాటలో..
    జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 197మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా కొలువు దీరారు. ఉద్యోగాలు రావడంతో ఆనందపడ్డారు. మొదట్లో ఉన్న సంతోషం మెల్లమెల్లగా సన్నగిల్లింది. ప్రతి నెలా రావాల్సిన వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పని ఒత్తిడి ఎక్కువ కావడం.. జీతాల్లో తీవ్ర జాప్యంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో 34 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేసి వెళ్లిపోయారు.
    ఉద్యోగ భద్రత కరువు..
    జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరిన వారికి కనీస ఉద్యోగ భద్రత లేదు. రూ.15వేల రూపాయల వేతనంతో మూడేండ్ల పాటు పని చేయాలని ఒప్పందం ఉండడంతో చాలా మంది ఉద్యోగాలకు మంగళం పాడుతున్నట్టు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఉద్యోగాలు రావడంతో కొందరు ఉద్యోగాలు మానివేయగా, మరికొందరు మాత్రం ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో పాటు కనీస వేతన స్కేలు అమలు చేయకపోవడం వల్లే విధుల నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.
    లక్ష్యం చేరుకోలేక..
    జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారు అధికారులు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికార యంత్రాంగం హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలు, తదితర పనులు వేగవంతం చేసేందుకు లక్ష్యంగా నిర్ణయిస్తారు. ఇలాంటి వాటిని చేసేందుకు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగంలో అనుభవం తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ, అన్ని రకాల పనులు ఒకేసారి మీద పడటంతో ఉద్యోగాలను వదులుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటేనే రాజీనామాలు తగ్గే అవకాశం ఉంది.
    వేతనాల జాప్యం..
    ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నాం. జీతం ఆలస్యం కాదనే ఉద్దేశంతో అనేక మంది విధులు స్వీకరించారు. అయితే ఉద్యోగాల్లో చేరిన తర్వాత మాత్రం పరిస్థితి మరోలా ఉంది. విపరీతమైన పని ఒత్తిడి ఉండడం, నెల ముగిసిన అనంతరం వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. ఈ ఉద్యోగం కన్నా ప్రయివేటు కొలువే మేలు అనే స్థితిలో అనేకమంది ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా ఎన్నికైన వారు నెలనెలా వేతనాలు వస్తాయని తొలుత ఆశించారు. కానీ ఆ స్థాయిలో వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. తమకు వేతనాలు ఎప్పుడు వస్తాయోననే ఆందోళనలో సైతం కార్యదర్శులు ఉన్నారు.

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.